ఓ రైల్వేస్టేషన్ లో పుట్టిన రోజు సంబరాలు అంబరాన్ని తాకాయి. కేక్ కట్ చేసి అధికారులు ఒకరి కొకరు తినిపించుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఏ అధికారి పుట్టిన రోజు కాదు.. మరి ఈ వేడుకలు ఎందుకు నిర్వహించారనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉండి అక్కడి జనాలను.. ఇక్కడికి ( హైదరాబాద్)... ఇక్కడి జనాలను .. అక్కడికి ( విశాఖ)కు నిర్విరామంగా తీసుకెళ్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రారంభించిన రోజు ఫిబ్రవరి 1. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే 1974 ఫిబ్రవరి 1 వ తేదీన గోదావరి ఎక్స్ ప్రెస్ వాల్తేర్ - సికింద్రాబాద్ మద్య ట్రైన్ నంబర్ 7007 గా, సికింద్రాబాద్ - వాల్తేర్ మద్య ట్రైన్ నంబర్ 7008 గా ప్రవేశ పెట్టారు.
విశాఖపట్నం - సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది.ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్ల తో విశాఖ పట్నం - సికింద్రాబాద్ మద్య నడుస్తుంది. ఈ ట్రైను710 కిలో మీటర్లు (440 మైల్స్) ప్రయాణంలో 18 స్టేషన్లో ఆగుతుంది. 17 బోగీలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు గంటకు 57 కిలో మీటర్లు (35 మైల్ ఫర్ అవర్) తో ప్రయాణిస్తుంది. 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలు అందించిన ఘనత సాధించిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు.సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిముషాలు.
విశాఖ రైల్వే స్టేషన్ సిబ్బంది గోదావరి ఎక్స్ప్రెస్ ను పూలతో ముస్తాబు చేశారు. ప్రత్యేకమైన పూజలు చేశారు. 50 ఏళ్ల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో సేవలందిస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ పుట్టినరోజును ఎంతో ఘనంగాజరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజధాని హైదరాబాద్కు వెళ్లాలంటే ఈ ట్రైన్ ఎంతో కన్విన్వెంట్ గా ఉందని స్థానికులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వేలో మొదటి ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్ లు మొదలయింది ఈ రైల్లోనే. 2000 సంవత్సరంలో 6 ఎయిర్ కండిషన్డ్ కోచ్ లున్న తొలిరైలుగా గుర్తింపు పొందింది. 2011 ఈ గోదావరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అయింది. ఆయేడాదే రైలు నంబర్ ను 12727 గా మార్చారు. అంతేకాదు, WAP-7 బండి అయింది. WAP-7 అంటే బ్రాడ్ గేజ్ (w) AC కరెంట్ (A) ప్యాసెంజర్ ట్రాఫిక్ (P) సెవన్గ్ జనరేషన్ ట్రెయిన్ . ఈ 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలు అందించిన ఘనత సాధించిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు.ఈ రోజు సాయంత్రం ( ఫిబ్రవరి 1) గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు కు దక్షిణ మధ్య రైల్వే శాఖ పుట్టిన రోజు వేడుకలు జరిపింది.